: ఉపఎన్నికలు... బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు తలా ఒక చోట ఆధిక్యం
మధ్యప్రదేశ్ లోని రాట్లాం పార్లమెంటు నియోజకవర్గంతో బాటు దేవాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి, తెలంగాణలోని వరంగల్ పార్లమెంటు స్థానానికీ జరిగిన ఉప ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వరంగల్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ విజయం ఖాయమైపోగా, రాట్లాం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతీలాల్ భూరియా, దేవాస్ లో బీజేపీ అభ్యర్థి గాయత్రీ రాజే పౌర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంతీలాల్ 5 వేల ఓట్లకు పైగా మెజారిటీలో ఉండగా, గాయత్రీ రాజే 3 వేల ఓట్లకు పైగా మెజారిటీలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి అన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.