: హైదరాబాదు మాల్స్ లో భద్రత డొల్ల!...బిగ్ బజార్, లైఫ్ స్టైల్, సెంట్రల్ లకు నోటీసులు
భాగ్యనగరి హైదరాబాదులో షాపింగ్ మాల్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని దాదాపుగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ వెలిశాయి. వీటిలోకి వెళ్లే సమయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేసిన తర్వాత కాని మనల్ని లోపలకు అనుమతించరు. అయితే ఇదంతా షో పుటప్ మాత్రమేనని తేలిపోయింది. తుపాకులతో లోపలికి ప్రవేశించినా ఏ ఒక్క మాల్ లోని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేరని తేలిపోయింది. రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో నిన్న పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పోలీసు అధికారులు మఫ్టీలో తుపాకులు చేతబట్టి షాపింగ్ మాల్స్ లోకి ఎంటరయ్యారు. వీరిని ఏ ఒక్క షాపింగ్ మాల్ సిబ్బంది కూడా గుర్తించలేకపోయారు. దీంతో షాపింగ్ మాల్స్ లో మారణాయుధాలతో దుండగులు చొరబడినా అడ్డుకునే అవకాశాలు లేవని తేలిపోయింది. దీనిపై కాస్తంత ఘాటుగా స్పందించిన పోలీసులు నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న మాల్స్ లో బిగ్ బజార్, లైఫ్ స్టైల్, హైదరాబాద్ సెంట్రల్, సిటీ సెంట్రల్ మాల్స్ ఉన్నాయి.