: షీనా బోరా ప్రేమ కథ అలా మొదలైంది...హత్య ఇలా జరిగింది!
షీనా బోరా హత్యోదంతం గత రెండు నెలలుగా ముంబై కార్పొరేట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు షీనా బోరా ఎందుకు హత్యకు గురైందనే విషయాలను పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ ముఖర్జియా ముంబై పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... షీనాను రాహుల్ తొలిసారి 2008లో చూశాడు. పీటర్ రెండోసారి పెళ్లి చేసుకున్న తరువాత కొంత కాలానికి వర్లిలోని ఆయన నివాసంలో ఉండేందుకు వెళ్లాడు. అప్పుడే తొలిసారి షీనాను రాహుల్ చూశాడు. తరువాత జరిగిన పరిచయం మరింత చనువుగా మారి తరచు కలుసుకునే వరకు వెళ్లింది. ఆ తరువాత నెల రోజులకే తాను ఇంగ్లండ్ వెళ్లానని, కొన్నాళ్లు అక్కడే ఉండి, ముంబై వచ్చానని చెప్పాడు. ఈసారి తనను ఇంట్లో ఉంచకుండా వేరే చోట ఉంచేలా ఇంద్రాణి తన తండ్రితో చెప్పించిందని, దీంతో తాను ఖార్ దండ్ లో ఫ్లాట్ తీసుకుని ఉన్నానని చెప్పాడు. తన తండ్రి పలుకుబడి ఉపయోగించి ప్రైమ్ ఫోకస్ లో ఉద్యోగం సంపాదించానని రాహుల్ పోలీసులకు వాంగ్మూలంలో తెలిపాడు. ఉద్యోగంలో చేరడంతో తామిద్దరం తరచు కలుసుకునే వారమని రాహుల్ వెల్లడించాడు. దీంతో తమ అనుబంధం మరింత పెరిగిందని, ఒకరోజు షీనా తన ఫ్లాట్ కు వచ్చి, తాను ఇంద్రాణి చెల్లెల్ని కాదని, ఆమె కుమార్తెనని చెప్పిందని రాహుల్ వెల్లడించాడు. తమ ఇద్దరి విషయం తెలిసిన ఇంద్రాణి తన తండ్రికి ఫిర్యాదు చేసిందని, అంతటితో ఆగకుండా తన తండ్రితో పోట్లాడిందని రాహుల్ పేర్కొన్నాడు. దీంతో 2009లో షీనాను ఢిల్లీ పంపారని, అక్కడ షీనా తీవ్ర అనారోగ్యానికి గురైందని, దీంతో ఆసుపత్రిలో ఉన్న షీనాను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారని షీనా తెలిపిందని రాహుల్ చెప్పాడు. తరువాత ఇంద్రాణి ఒత్తిడితో షీనాను తన మాజీ ప్రియుడి ఇంటికి పంపించారని రాహుల్ పేర్కొన్నాడు. తన దగ్గర అప్పుడు డబ్బులు లేకపోవడంతో తన ఇంట్లో వస్తువులు అమ్మి షీనాను చూసేందుకు వెళ్లానని రాహుల్ తెలిపాడు. అప్పుడు షీనా చాలా బలహీనంగా కనిపించిందని, దీంతో ఆమె వాడుతున్న మందులు వేరే డాక్టర్ కు చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని సూచించినట్టు రాహుల్ పేర్కొన్నాడు. వాటిని మానేయడంతో షీనా కోలుకోవడం మొదలు పెట్టిందని, దీంతో ఆమెను షీనా తాత, అమ్మమ్మ అనుమతి తీసుకుని తన తల్లి దగ్గరకు డెహ్రాడూన్ తీసుకెళ్లానని రాహుల్ తెలిపాడు. 2009 చివర్లో షీనాను ముంబై తీసుకుని రావడంతో అప్పుడు షీనాకు వేరే ఉద్యోగం దొరికిందని రాహుల్ వెల్లడించాడు. దీంతో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇది తెలిసిన ఇంద్రాణి అగ్గిమీదగుగ్గిలం అయ్యిందని రాహుల్ చెప్పాడు. దీంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయని రాహుల్ వివరించాడు. వీటన్నింటికి విరుగుడుగా 2011లో డెహ్రాడూన్ వెళ్లి తన తల్లి, షీనా తాత, అమ్మమ్మ అనుమతితో నిశ్చితార్థం చేసుకున్నామని రాహుల్ చెప్పాడు. ముంబై వచ్చిన తరువాత ఈ విషయం ఇంద్రాణికి తెలిసిందని, అప్పుడు ఎంతో మారినట్టు కనిపించిందని రాహుల్ గతం గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత షీనాను ఇంద్రాణి ఒకసారి డిన్నర్ కు పిలిచిందని, షీనా హత్య ముందు రోజు కూడా షీనాను డిన్నర్ కు పిలిచి నిశ్చితార్థం బహుమతి ఇస్తానని చెప్పిందని రాహుల్ తెలిపాడు. హత్య ముందురోజు 2012 ఏప్రిల్ 24న షీనాను ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చానని, ఆ రోజు ఇంద్రాణి షీనా ఎక్కడ? అంటూ పదేపదే ఫోన్ చేసిందని, దీంతో తాను షీనాను తన కారులో తీసుకుని ఇంద్రాణి చెప్పిన చోటికి వెళ్లానని, అక్కడ ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు ఉన్నారని, వారి పక్కనే షెవర్లె కారులో డ్రైవింగ్ సీట్లో శ్యామ్ రాయ్ ఉన్నాడని రాహుల్ ముఖర్జియా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. అనంతరం షీనా నెంబర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదని, తరువాత కొంత కాలానికి ఆమె మొబైల్ నుంచి తాను వేరే వ్యక్తిని చూసుకున్నానని, తనను మర్చిపోవాలని పేర్కొంటూ ఓ మెసేజ్ వచ్చిందని రాహుల్ తెలిపాడు. ఈ మొత్తం వాంగ్మూలంలో రాహుల్ పీటర్ ముఖర్జియా పేరును ఒకేసారి ప్రస్తావించడం విశేషం. అయితే షీనా హత్యా పథకం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని దర్యాప్తు బృందం భావిస్తోంది.