: మరో వివాదంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. కేంద్రీయ విద్యా సంస్థల్లో 5,100 మందికి సిఫారసు చేసిన మంత్రిగా రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రిగా, కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ ఛైర్ పర్సన్ గా స్మృతీ ఇరానీ 1200 మంది విద్యార్థులకు సిఫారసు చేసే అధికారం ఉంది. అయితే తన పరిమితికి నాలుగింతలు సిఫారసు చేయడంతో వివాదం రేగింది. అయితే ఈ వివాదంపై మంత్రి వివరణ ఇస్తూ, తాను సిఫారసు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా వంటి వారు పంపినవారు కూడా ఉన్నారని నోరు జారారు. కాగా, మంత్రి 5,100 మందికి సిఫారసు చేసినా నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా 3000 సిఫారసులను మాత్రమే కేంద్రీయ విద్యాలయ బోర్డు అంగీకరించింది. అయితే మిగతా సిఫారసులు ఎందుకు తిరస్కరించారన్న కారణంపై మంత్రి కార్యాలయం దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఏ మంత్రి 1500కు మించి సిఫారసు చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. అవినీతిని అంతమొందిస్తామని చెబుతున్న ఎన్డీయే ప్రభుత్వంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.