: తమిళనాడులో మళ్లీ వర్షాలు!
మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా తమిళనాడులో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నైలోని రోడ్లు జలమయమైతే ‘ఓలా’ బోట్లను రంగంలోకి దింపి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఉత్తర తమిళనాడు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశమున్నట్లు సమాచారం. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో చెన్నైలో 5 వేల మందికి పైగా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నై, తిరవళ్లూరు, కాంచీపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరిలోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు.