: ఆ బోగస్ కంపెనీలకు పనిమనుషులు, రిక్షా కార్మికులే డైరెక్టర్లు!


'బ్యాంక్ ఆఫ్ బరోడా'కు చెందిన 6,172 కోట్ల కుంభకోణంలో ఆయా కంపెనీల డైరెక్టర్ల గురించి తెలిస్తే విస్తుపోవడం మన వంతవుతుంది. ఢిల్లీలో కూరగాయలమ్ముకునే వారు, రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషులు.. ఇలా రకరకాల వ్యక్తులు 59 బూటకపు కంపెనీలకు డైరెక్టర్లు కావడం విశేషం. బ్యాంకింగ్ హవాలా కుంభకోణంగా పేర్కొనే ఈ ఘరానా మోసంలో నిరుపేదల పేర్లను, వారి గుర్తింపు కార్డులను వాడుకుని, అక్రమంగా సంపాదిస్తున్న వందల కోట్ల రూపాయలను విదేశాలకు ఎలా తరలించారో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ల దర్యాప్తులో వెలుగు చూసింది. తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను ఎగుమతి, దిగుమతి దారులుగా వాడుకుంటూ అక్రమంగా సంపాదిస్తున్న సొమ్మును విదేశాలకు తరలించే వైనాన్ని దర్యాప్తులో అధికారులు కనుగొన్నారు. నెలకు పదివేల రూపాయలు ఇస్తామని నమ్మించి, వారి నుంచి ఓటర్ ఐడీలు తీసుకుని, వారి పేర్లపై పాన్ కార్డులు తెప్పించి, ఎగుమతి, దిగుమతి దారులంటూ ఆయా బూటకపు కంపెనీల్లో వారిని బోర్డు డైరెక్టర్లుగా చేర్చారు. వారి పేర్లపై బ్యాంక్ ఆఫ్ బరోడాలో కరెంటు ఖాతాలు తెరిచారని సీబీఐ అధికారులు తెలిపారు. నకిలీ చిరునామాలు సృష్టించి అత్యంత పకడ్బందీగా 2014 ఆగస్టు నుంచి నేటి వరకు ఈ స్కాం నిర్వహించారని వారు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన సొమ్ముగా 6,172 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంచారని, ఆ మొత్తాన్ని ఇంకో బ్యాంకు నుంచి అక్రమ పద్ధతుల్లోనే ఈ బ్యాంకుకు తరలించారని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News