: మద్యపాన నిషేధం దిశగా బీహార్
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా బీహార్ కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత జూలైలో తాను మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. తాజా ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దీంతో కొత్త ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా ఆలోచిస్తోందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి అబ్దుల్ జలీల్ మస్తాన్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, నిషేధం విషయమై ఆలోచిస్తున్నామని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టామని అన్నారు. రానున్న ఆరునెలల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.