: ఉదయం పంచాయతీ...మధ్యాహ్నం 'ఐఎస్ఐఎస్'తో పోరాటం: తాలిబాన్ యోధుడి జీవన సమరం!
ఐఎస్ఐఎస్ పేరు చెబితే చాలు, ప్రపంచంలో ఏ మూల నున్న వారికైనా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దేవుడి రాజ్య స్థాపన పేరిట అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న ఐఎస్ఐఎస్ పై 90 శాతం మంది అభిప్రాయం ఇదే. కానీ ఆఫ్ఘన్ కు చెందినా ఓ తాలిబాన్ యోధుడు హాజీ గాలీబ్ ముజాహిద్ కి మాత్రం ఆ ఆవేశం అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఐఎస్ఐఎస్ కారణంగా తన కుటుంబంలోని 24 మందిని కోల్పోయాడు మరి! 1980లో అమెరికా ప్రోద్బలంతో రష్యాపై యుద్ధం చేశాడు. 2003లో తన ప్రాణ స్నేహితుడు అబ్దుల్ రహీం ముస్లింతో పాటు అమెరికాకు పట్టుబడ్డాడు. తీవ్రవాది అనే ముద్రతో అమెరికా అతన్ని అరెస్టు చేసింది. అయితే అప్పటికి ఆల్ ఖైదాతో ముజాహిద్ కి సంబంధాలు లేకపోవడంతో, ఆ ఆధారాలు వికీ లీక్స్ బయటపెట్టింది. దీంతో అమెరికా వారిద్దర్నీ విడిచిపెట్టింది. దీంతో ముజాహిద్ ఆఫ్ఘనిస్థాన్ లోని స్వస్థలానికి చేరుకోగా, రహీం పాకిస్థాన్ వెళ్లి తీవ్రవాద సంస్థలో చేరాడు. ఇంటికి వచ్చిన ముజాహిద్ కి ఐఎస్ఐఎస్ చేతుల్లో నలిగిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ కనిపించింది. పాకిస్థాన్ నుంచి నిధులు అందుకుంటున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ లో సాటి ముస్లింలను హత్యలు చేయడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలను ఆక్రమిస్తూ, గిరిజనులపై నరమేధం సాగిస్తున్నారు. దీంతో కలత చెందిన అతను 'తాలిబాన్' (జ్ఞానం అన్వేషించేవాడు) అన్న పదానికి అసలైన భాష్యం చెబుతున్నాడు. అచిన్ జిల్లా గవర్నర్ గా నియమితుడైన ముజాహిద్ దినచర్య...ఉదయం ఐఎస్ఐఎస్ చేతిలో అన్యాయానికి గురైన లేక సమస్యలలో ఉన్న వారికి చేయూతనివ్వడం, మధ్యాహ్నం ఏకే 47 చేత బట్టి నేరుగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో యుద్ధానికి దిగడం. రంజాన్ రోజున నమాజ్ చేస్తున్న తన కుటుంబంపై ఐఎస్ఐఎస్ బాంబులు ప్రయోగించి 18 మందిని మట్టుబెట్టిందని, ఆ రోజు 'అబ్బూ! ఒళ్లంతా కాలిపోతోంది, కాపాడు అబ్బూ' అంటూ తన పిల్లలు చేసిన ఆర్తనాదాలు తన చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయని, ఆ రోజు నుంచి తన లక్ష్యం ఐఎస్ఐఎస్ ను అంతం చేయడం అని ముజాహిద్ చెబుతున్నాడు. కాగా, ముజాహిద్ పోరాడుతున్న ఐఎస్ఐఎస్ దళ కమాండర్ అతని ప్రాణ స్నేహితుడు అబ్దుల్ రహీం ముస్లిం కావడం ఇక్కడ పెద్ద విశేషం!