: శబరిమల ప్రధాన పూజారి వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళాలోకం!


దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ప్రధాన పూజారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గోపాలకృష్ణన్ మహిళల నెలసరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని పుట్టిస్తున్నాయి. మహిళలు బహిష్టు సమయంలో ఉన్నారో, లేరో పరిశీలించే మెషీన్లను తీసుకువచ్చిన తరువాత, వారిని కూడా ఆలయంలోకి అనుమతించే నిర్ణయం తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. "ప్రస్తుతం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే మహిళలను అనుమతించడం లేదు. త్వరలోనే సంవత్సరమంతా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలన్న రోజులు రావచ్చు. ప్రస్తుతం శరీరాల్లో దాచుకుంటున్న ఆయుధాలను గుర్తించే స్కానర్లు వచ్చాయి. ఏదో ఒకరోజు మహిళల శుభ్రతను గుర్తించే మెషీన్లూ వస్తాయి. అవి తెచ్చి పెట్టిన తరువాత, వారి ఆలయ ప్రవేశం గురించి ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్టు సమయానికి దగ్గరగా ఉన్న వారిని ఆలయంలోకి అనుమతించే ప్రశ్నే లేదు" అని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో 'హ్యాపీ టూ బ్లీడ్' పేరిట ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగా మహిళలు శబరిమల పూజారి మాటలను వ్యతిరేకిస్తూ, చేతుల్లో ప్లకార్డులు, శానిటరీ నాప్కిన్స్, పోస్టర్లు పట్టుకుని తమ చిత్రాలను పోస్టు చేయాలని కోరగా, ఇప్పటికే 100 మంది మహిళలు తమ చిత్రాలను పోస్టు చేశారు. నెలసరి అనేది మహిళల శారీరక నిర్మాణంలో సహజంగా జరిగేదేనని, దీన్ని దాచుకోవాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పూజారి వ్యాఖ్యలు మహిళాలోకాన్ని అవమానపరిచేవిగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News