: ప్రాణాలు తీసిన ఆ బంతి పడి సంవత్సరం!
అది ఓ స్టార్ క్రికెటర్ ప్రాణాలు తీసిన బంతి. నిప్పులు చెరుగుతూ రాకపోయినా, పరుగులను ఆపుతుందని అబాట్ వేసిన బౌన్సర్ రూపంలో వేసిన బంతి అది. బ్యాటింగ్ చేస్తున్న ఫిలిప్ హ్యూస్ కు తాకి క్షణాల్లో అతని మెదడులో రక్తాన్ని గడ్డకట్టించింది. రెండు రోజుల అనంతరం ప్రాణాలు తీసింది. హ్యూస్ ను మృత్యుఒడికి చేర్చిన ఆ బంతి పడి ఎల్లుండికి సరిగ్గా సంవత్సరం. గత సంవత్సరం నవంబర్ 25న సిడ్నీ మైదానంలో జరిగిన ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచంతో పాటు మొత్తం క్రీడా ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. హ్యూస్ విషాదాంతం మరెన్నో సంవత్సరాల పాటు క్రికెట్ క్రీడాకారులను వెంటాడుతుందనడంలో సందేహం లేదు. బౌన్సర్ వేయాలని భావించిన ప్రతి బౌలర్ మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కూడా అబాట్ వేసిన ఆ బంతి గుర్తు చేస్తుంది. హ్యూస్ దూరమై ఏడాది గడవనున్న సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అతనిని గుర్తు చేసుకుంటూ, సిడ్నీ మైదానంలో బుధవారం నాడు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.