: శీతాకాలంలో వేడి సెగలు!... అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు!
భారత పార్లమెంటు సమావేశాలు అంటేనే, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, అధికార పక్షంపై విపక్షాలు ఎత్తిపొడుపులు, అధికార పార్టీలు గత ప్రభుత్వాల విధానాలను ఎండగట్టడం... చివరకు సభ వాయిదా పడటం... ఇదంతా మనకు తెలుసు. ఈ దఫా కూడా అదే 'సంప్రదాయం' కనిపించనుంది. గురువారం నుంచి మొదలుకానున్న శీతాకాల సమావేశాలు మరింత వేడిని పుట్టిస్తాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అవినీతి, అసహనం ఈ సమావేశాల్లో 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్' కానున్నాయి. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన పార్లమెంట్ సమావేశాలకు, ఈ సమావేశాలకు ఎంతో తేడా ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. లోక్ సభలో సంఖ్యాబలం లేకున్నా, బీహార్ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీకి మరింత ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు, ఐపీఎల్ కుంభకోణం సూత్రధారి లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు కాంగ్రెస్ చేతుల్లోని ప్రధాన అస్త్రాల్లో ఒకటి. తమ బాధ్యతలను మరచి, లలిత్ కు సాయపడాలన్న వారి 'ఆకాంక్ష', పార్లమెంట్ ను మరోమారు కుదిపేయవచ్చు. ప్రభుత్వాన్ని ఇరికించే విషయంలో ఏకపక్షమవుతున్న విపక్షాలు, ఎప్పటికప్పుడు వెల్ లోకి దూసుకెళ్లడం, ప్లకార్డులు ప్రదర్శించడం, సభా కార్యక్రమాలకు అడ్డు తగలడం వంటివి ఈ శీతాకాల సమావేశాల్లో నిత్యమూ కనిపించే అంశాలేనని నిపుణులు భావిస్తున్నారు. ఇక దేశాభివృద్ధి లక్ష్యంగా మోదీ సర్కారు ఇటీవల ప్రకటించిన ఎఫ్డీఐ పరిమితుల సడలింపు నుంచి ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్, బీమా సంస్కరణలు వంటి కీలక బిల్లులు ఈ దఫా కూడా ఆమోదం పొందే మార్గం కనిపించడం లేదు. పార్లమెంటులో బలం ఉన్నప్పటికీ, బీజేపీకి రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి చాలినంత బలగం లేకపోవడం ఆ పార్టీకి ప్రధాన అడ్డంకిగా మారింది. ఇక బీహార్ లో విజయం సాధించడం ద్వారా అడ్డంకులు దాటవచ్చని భావించిన బీజేపీకి ఆ రాష్ట్ర ఫలితాలు అశనిపాతమయ్యాయి. ఇదే సమయంలో విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకు ఎన్డీయే పక్షాలు రాహుల్ పౌరసత్వ వివాదాన్ని వాడుకోవచ్చని తెలుస్తోంది. కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం దగ్గరుండి జరిపించడాన్ని కూడా అధికార పక్షం ప్రస్తావించడం ఖాయం. ఆ వెంటనే అసహనం, ఆవుల ఉదంతం, దళితుల హత్యలు వంటివి బీజేపీ దగ్గరుండి చేయిస్తుందని కాంగ్రెస్ తదితర విపక్షాల ఆరోపణ... ఫలితంగా సభలు వాయిదా. మరో రెండు రోజుల తరువాత జరిగే పార్లమెంట్ సెషన్లలో నిత్యమూ జరిగే రోజువారీ తతంగం ఇదే కావచ్చు... ఇవేమీ లేకుండా సమావేశాలు సజావుగా జరిగితేనే ఆశ్చర్యపడాలి!