: చింటూ రాయల్ ఆస్తుల సీజ్... మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసు దర్యాప్తులో చిత్తూరు పోలీసులు వేగం పెంచారు. ఈ కేసుపై దృష్టి సారించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పోలీసుల ఉదాసీన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాయలసీమ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ చిత్తూరులోనే మకాం వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింటూ రాయల్ ఇల్లు, కార్యాలయాల్లో మొన్న సోదాలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్న చింటూ సన్నిహితుల ఇళ్లలోనూ దాడులు చేసిన పోలీసులు మరింత సమాచారం సేకరించారు. నేటి ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు చింటూ రాయల్ ఆస్తుల సీజ్ కు తెరలేపారు. చిత్తూరు నగరం మురకంబట్టులోని చింటూ వైన్ షాప్ ను సీజ్ చేసిన పోలీసులు చిత్తూరు జిల్లాలోని యాదమరి మండల పరిధిలో చింటూ నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ వద్దకెళ్లి అక్కడి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోనూ చింటూ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడన్న వార్తలతో అటు దిశగానూ పోలీసులు దృష్టి సారించారు.