: లిఫ్ట్ లో చిక్కుకున్న చంద్రబాబు...ఉరుకులు పరుగులు పెట్టిన భద్రతా సిబ్బంది!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భద్రతా సిబ్బంది నిన్న తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులతో సమీక్ష కోసమంటూ వెళ్లిన చంద్రబాబు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన ఆయన భద్రతా సిబ్బంది ఎట్టకేలకు లిఫ్ట్ నుంచి చంద్రబాబును బయటకు తెచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న శ్రీకాళహస్తిలో వరద ప్రభావంపై చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. ఇందుకోసం ఆయన పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో నాలుగో అంతస్తుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ఎక్కిన లిఫ్ట్ నాలుగో అంతస్తుకు అయితే వెళ్లింది కానీ, తలుపులే తెరచుకోలేదు. దాదాపు రెండు నిమిషాల పాటు భద్రతా సిబ్బంది యత్నించినా లిఫ్ట్ తలుపులు తెరచుకోలేదు. దీంతో వెనువెంటనే లిఫ్ట్ ను గ్రౌండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లగా అక్కడ మాత్రం లిఫ్ట్ తలుపులు తెరచుకున్నాయి. దీంతో చంద్రబాబును బయటకు తీసుకొచ్చిన భద్రతా సిబ్బంది అక్కడే ఉన్న మరో లిఫ్ట్ లో ఆయనను నాలుగో ఫ్లోర్ కు తీసుకెళ్లారు.