: నా కొడుకు సరే...మరి మీ మాటేంటి?: ‘ప్రమాణం’ తత్తరపాటుపై మోదీకి లాలూ సవాల్!


మొన్న బీహార్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవంలో తొలిసారి మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ ఓ పదం ఉచ్చారణలో తత్తరపడ్డారు. దీంతో ఆయనను వారించిన బీహార్ గవర్నర్ రాంనాథ్ గోవింద్... తేజ్ ప్రతాప్ తో ఆ పదాన్ని మరోమారు పలికించారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన రీతిలో సెటైర్లు విసిరారు. ఈ ఘటన లాలూ ప్రసాద్ ను బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. నెటిజన్లతో పాటు గవర్నర్ కు కూడా షాకిచ్చేలా ఆయన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది కూడా భారత ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసిన లాలూ... మీరు కూడా మరోమారు ప్రమాణం చేయాల్సిందేనంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సూచించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో గతేడాది మే 26న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మోదీ ఓ పదాన్ని తప్పుగా పలికారట. ‘అక్షుణ్ణ’ అనే హిందీ పదాన్ని మోదీ ‘అక్ష్న’గా ఉచ్చరించారట. దీనినే ఎత్తిచూపుతూ లాలూ ప్రసాద్ సదరు వీడియోను ప్రధాని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీహార్ గవర్నర్ రాంనాథ్ గోవింద్ బీజేపీ నేత అయినందునే తేజ్ ప్రతాప్ తో ఓ పదాన్ని రెండు స్లారు పలికించారని ఈ సందర్భంగా లాలూ విరుచుకుపడ్డారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ పదాన్ని తప్పుగా పలికిన మోదీ చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించాల్సిందేనంటూ లాలూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News