: దావూద్ ను తీసుకురావడం అంత ఈజీ కాదు... ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ కామెంట్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను దేశానికి రప్పించి తీరతామని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పదే పదే ప్రకటిస్తోంది. దావూద్ ఆటలు ఇకపై సాగబోవని తరచూ ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అతడిని బోనులో నిలుపుతామని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దావూద్ ప్రస్తుతం పాకిస్థాన్ లో సురక్షితంగా ఉండటమే కాక పలు దేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు అతడికి సంబంధించిన సమాచారాన్ని పాక్ ప్రభుత్వానికి అందజేస్తున్న కేంద్రం, ఎలాగైనా దావూద్ ను భారత్ తీసుకురావాలని యత్నిస్తోంది. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న యత్నాలేవీ ఫలించే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన నీరజ్ కుమార్ చెబుతున్నారు. మాఫియాపై ఉక్కుపాదం మోపడమే కాక, గతంలో దావూద్ తో తాను నేరుగా మాట్లాడానని ప్రకటించిన నీరజ్, చీకటి ప్రపంచం కార్యకలాపాలపై తనదైన శైలిలో ‘డయల్ డీ ఫర్ డాన్’ పేరిట ఓ పుస్తకం రాశారు. సదరు పుస్తకాన్ని ఆయన నిన్న ముంబై వేదికగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావూద్ ఆనుపానులు తెలిసిన చోటా రాజన్ ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమీ లాభం లేదని కూడా చెప్పారు. దావూద్ ను భారత్ కు రప్పించడం అంత సులువేమీ కాదని పేర్కొన్న నీరజ్ అందుకు గల కారణాన్ని కూడా చెప్పారు. శత్రు దేశానికి చెందిన రక్షణ వలయంలో దావూద్ సురక్షితంగా ఉన్నాడని, అలాంటి నేరగాడిని తీసుకురావడం అంత ఈజీ కాదని తెలిపారు.