: శిల్పాశెట్టి తండ్రికి 2 కోట్లకు టోపీ పెట్టిన స్వామీజీ అరెస్టు
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టికి 2 కోట్ల రూపాయలకు టోపీ పెట్టిన స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆయుర్వేద మందుల కంపెనీతో పాటు, యోగ పీఠం పెడదామంటూ బాబా దేవేంద్ర అనే స్వామీజీ సురేంద్ర శెట్టిని కలిశారు. ఇందుకు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని, ఆ డబ్బు సర్దుబాటు చేయాలని స్వామీజీ సురేంద్ర శెట్టిని కోరారు. స్వామీజీని నమ్మిన సురేంద్ర శెట్టి 2 కోట్ల రూపాయలు అందజేశారు. డబ్బు అందుకున్న స్వామీజీ తరువాత కనపడడం మానేశారు. దీంతో సురేంద్ర శెట్టి ముంబైలోని అంధేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాబా దేవేంద్రను ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపూర్ లో గుర్తించి, అరెస్టు చేశారు. అతనిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.