: పిలుపు కోసం ఎదురు చూస్తున్నా: ఇర్ఫాన్ పఠాన్
జాతీయ జట్టులో పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని ఒకప్పటి టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. గాయాలు, పేలవమైన ఫామ్ తో మూడేళ్ల క్రితం జాతీయ జట్టుకు ఇర్ఫాన్ దూరమయ్యాడు. ఆ తర్వాత జట్టులోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేసినా, ఫలించలేదు. అయితే, ఇటీవల రంజీల్లో బరోడా తరపున ఆడిన ఇర్ఫాన్ సత్తా చాటాడు. రెండు మ్యాచ్ లలో 90 పరుగులు చేశాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 73 పరుగులు చేయడమే కాక, ఆరు వికెట్లు తీశాడు. అలాగే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో ఆరు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో, తన ఆటను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారని ఇర్ఫాన్ భావిస్తున్నాడు.