: ‘బీఫ్’ వ్యాపారుల్లో 95 శాతం మంది హిందువులే!...ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంచలన ప్రకటన


బీహార్ ఎన్నికల నేపథ్యంలో గోమాంసం, అసహనం పదాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. గోమాంసం వ్యాపారంలో నిమగ్నమయ్యారంటూ ముస్లింలపై హిందూ వర్గాలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తిన్నాడన్న కారణంగా ముస్లిం వ్యక్తి అఖ్లాక్ ను దాద్రిలో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీందర్ సచార్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమాంసం వ్యాపారంలో ముస్లింల కంటే హిందువులే అధికంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ఉత్తరప్రదేశ్, మధురలోని ఆర్సీ ఢిగ్రీ కళాశాలలో ‘ర్యాడికల్ ఇస్లామిక్’పై జరిగిన అంతర్జాతీయ స్థాయి చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా జస్టిస్ సచార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై 2006లో జరిగిన అధ్యయన కమిటీకి జస్టిస్ సచార్ నేతృత్వం వహించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన ఆ నివేదికలో గోమాంసం వ్యాపారంలో హిందువులే అధికంగా ఉన్నారన్న విషయాన్ని వెల్లడించామని ఆయన పేర్కొన్నారు. ‘‘గోమాంసం వ్యాపారుల్లో 95 శాతం మంది హిందువులే. దాద్రిలో గోమాంసం తిన్నాడన్న కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇది మానవత్వాన్ని హత్య చేయడమే. ఆహార అలవాట్లతో మతానికి సంబంధం లేదు. నేను కూడా గోమాంసం తింటాను’’ అని జస్టిస్ సచార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు, ప్రతినిధులు సభా ప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుతం జస్టిస్ సచార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News