: యూరప్ ప్రభావంతో లాభాలు 'హరీ'!
సెషన్ ఆరంభంలోని నష్టాలు కాసేపటికే భారీ లాభాలుగా మారగా, ఆపై మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల నష్టాలు దెబ్బకొట్టాయి. 2 గంటల తరువాత దాదాపు అన్ని సెక్టార్లలోని కంపెనీల ఈక్విటీల అమ్మకాలకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో ఒక దశలో 26 వేలను దాటి పరుగులు తీయబోయిన సెన్సెక్స్, 200 పాయింట్లను నష్టపోయింది. తర్వాత మళ్లీ కోలుకుని శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 26.577 పాయింట్లు పెరిగి 0.10 శాతం లాభంతో 25,868.49 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 13.80 పాయింట్లు పెరిగి 0.18 శాతం లాభంతో 7,856.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.86 శాతం, స్మాల్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు లాభాల్లో నడిచాయి. గెయిల్, విప్రో, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబుజా సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభపడగా, ఐటీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,77,960 కోట్లకు పెరిగింది. మొత్తం 2,884 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,451 కంపెనీలు లాభాలను, 1,201 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.