: తన కుటుంబ సభ్యులకే కేసీఆర్ భోళా శంకరుడు: రావుల
సీఎం కేసీఆర్ భోళా శంకరుడని, అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తుంటారని నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకే భోళా శంకరుడు కానీ ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావుల ఈ మేరకు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణలో బడ్జెట్ మిగులు ఉందని, కేసీఆర్ సీఎం పదవి చేపట్టిన తర్వాత దిగులు తెలంగాణగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తున్నా ఇంతవరకు కేంద్రానికి నివేదికలు పంపేందుకు ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు.