: ప్రజల తీర్పుతో కాంగ్రెస్ అసహనానికి గురవుతోంది: వెంకయ్యనాయుడు
దేశవ్యాప్తంగా అసహనం పేరుతో వస్తున్న నిరసనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో అసహనానికి గురవుతోందన్నారు. అందుకే అసహనం పేరుతో ఆ పార్టీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసమే కుల, మత శక్తులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తనకు నచ్చని వాళ్లను ఏదోవిధంగా ఇబ్బందులకు గురిచేయడం ఆ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో ఈ మేరకు మీడియాతో వెంకయ్య మాట్లాడారు. పారిస్ లో ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా ఖండిస్తుంటే కాంగ్రెస్ మాత్రం మతం రంగు పులుముతోందన్నారు. తీవ్రవాదానికి మతంరంగు పులమడం సరికాదని పేర్కొన్నారు. రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వర్షాభావ ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్టు ఆయన చెప్పారు.