: రజనీకాంత్ పై కోర్టులో పిటిషన్ వేసిన పీఎంకే
భారత న్యాయ వ్యవస్థపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ, సూపర్ స్టార్ రజనీకాంత్ పై పీఎంకే పార్టీ తరఫున చెన్నయ్, రాణిపేట కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన న్యాయమూర్తులను, న్యాయ వ్యవస్థలను కించపరిచే విధంగా మాట్లాడారన్నది పిటిషనర్ల ఆరోపణ. తాము ఇప్పటికే రాణిపేట పోలీసులకు, ఆపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే డైరెక్టుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రజనీకాంత్ కు ఉన్న పరపతి దృష్ట్యా ఎవరూ చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని, కోర్టే ఈ విషయాన్ని గమనించి వారికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అన్నది త్వరలో తేలనుంది. కాగా, ఇప్పటికే ఇవే తరహాలో వ్యాఖ్యలు చేసిన తమిళ రచయిత వైరముత్తుకు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.