: ఇక కేంద్ర ఉద్యోగుల గరిష్ఠ వేతనం రూ.2.5 లక్షలు... కనీస వేతనం రూ.18 వేలు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం భారీగా పెరగనుంది. ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం నియమించిన ఏడో వేతన సవరణ సంఘం నిన్న తన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని 16 శాతం మేర పెంచాలని సిఫారసు చేసిన సంఘం, భత్యాన్ని మాత్రం ఏకంగా 63 శాతం పెంచాలని చెప్పింది. వెరసి మూల వేతనం 23.55 శాతం పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు కేంద్రం సరేనంటే, జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన వేతనాలు అందనున్నాయి. సంఘం సిఫారసుకు అనుగుణంగా వేతనాలు పెరిగితే ఇకపై కేంద్ర ఉద్యోగుల గరిష్ఠ వేతనం 2.5 లక్షలకు చేరనుంది. అదే సమయంలో కనీస వేతనం కూడా రూ.18 వేలకు చేరుతుంది. దీని ఫలితంగా కేంద్ర ఖజానాపై ఏటా లక్ష కోట్ల అదనపు భారం పడనుంది.