: వెంకయ్య నాలుక జ్యోతిలక్ష్మి నడుము... ఏపీ మోదీకి కట్టుకున్న పెళ్లాం: సీపీఐ నారాయణ కామెంట్స్
సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరుగాంచిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న మరోమారు తన నోటికి పని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారాయణ... వెంకయ్యనాయుడు నాలుక జ్యోతిలక్ష్మి నడుములాంటిదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏపీ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్య, తాజాగా కుంటి సాకులు చెబుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగానే ఆయన వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మి నడుముతో పోల్చారు. వెంకయ్య నాలుక జ్యోతిలక్ష్మి నడుములా ఎటుబడితే అటు తిరుగుతుందని నారాయణ ఆరోపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ కట్టుకున్న పెళ్లామని కూడా నారాయణ అన్నారు. కట్టుకున్న పెళ్లాం లాంటి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ‘నీతో ఉండను’ పొమ్మంటున్న బీహార్ కు మోదీ అడగకుండానే వరాలిచ్చేశారని నారాయణ తనదైన శైలిలో నోటికి పని చెప్పారు.