: క్రిస్మస్ సెలవులు... చంద్రబాబు అమెరికా పర్యటనను రద్దు చేసేశాయి!


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓ చిన్న ముక్కగా మిగిలిన ఏపీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ఇప్పటికే పలు దేశాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఐటీ హబ్ గా పేరున్న కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ చంద్రబాబు పలుమార్లు పర్యటించారు. తాజాగా వచ్చే నెల 6 నుంచి 13 దాకా ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓలతో వరుస భేటీలకు ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. వెరసి ఏపీలో మరిన్ని పెట్టుబడులను రాబట్టేందుకు చంద్రబాబు దాదాపుగా సిద్ధపడ్డారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు అమెరికా పర్యటన రద్దైంది. దీనికి కారణమేంటని ఆరా తీస్తే, క్రిస్మస్ సెలవులే నేపథ్యమని తేలింది. అయినా క్రిస్మస్ సెలవులకు, చంద్రబాబు పర్యటన రద్దు కావడానికి సంబంధం ఏంటంటారా? క్రిస్మస్ సెలవుల కారణంగా అమెరికాలోని మెజారిటీ కంపెనీల సీఈఓలు అందుబాటులో ఉండరట. కంపెనీల సీఈఓలనే కలిసేందుకు అమెరికా వెళ్లాలనుకుంటే, వారే అందుబాటులో లేకపోతే ఇక పర్యటన ఎందుకని భావించిన చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్ సెలవుల తర్వాత ఆయన అమెరికా వెళతారు.

  • Loading...

More Telugu News