: ఐఎస్ఐఎస్ పని పడతాం... ప్రతిన బూనిన చైనా!
ఐరాక్, సిరియాలలో తిష్ట వేసుకుని కూర్చుని ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ పై చైనా మండిపడింది. తొలిసారి తమ జాతీయుడిని హత్య చేయడాన్ని ఆ దేశం సీరియస్ గా తీసుకుంది. ముస్లిం తీవ్రవాదం ఇన్నాళ్లు కేవలం భారత్ వరకు వచ్చి ఆగిపోతుండడంతో, సిసలైన తీవ్రవాదం ప్రభావం చైనాపై పడలేదు. దాంతో ప్రపంచంలో ఏం జరిగినా చైనా స్పందించలేదు. ఐఎస్ఐఎస్ గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందినా పట్టించుకోలేదు. తాజాగా తమ దేశానికి చెందిన వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేయడంతో ఇప్పుడు మేల్కొంది. ఇక ఐఎస్ఐఎస్ పని పడతామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ హెచ్చరించారు. అయితే, ఇప్పటికే ఐఎస్ఐఎస్ తో పోరాడుతున్న దేశాలతో కలిసి పోరాడాలా? లేక తాము మాత్రమే మెరుపుదాడులకు దిగాలా? అనే మీమాంసలో ఆ దేశం ఉంది. దీనిపై తమ కీలక స్ధాయి నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఏది చేస్తే మేలు జరుగుతుందని దీర్ఘాలోచనలో పడింది. అయితే ఈ పోరాటం కేవలం ఐఎస్ఐఎస్ కే పరిమితమా? లేక ఉగ్రవాదంపై కూడా ఇదే విధానమా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ చైనా ఈ పోరాటం ఉగ్రవాదంపై అని ప్రకటిస్తే మాత్రం, భారత్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, భారత్ ను భయపెట్టాలన్న ఒకే లక్ష్యంతో పాకిస్థాన్ లో కోట్లాది రూపాయల నిధులు, కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించేందుకు చైనా నడుం బిగించిన సంగతి తెలిసిందే. చైనా పోరాటం ప్రకటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి వ్యక్తం చేస్తోంది.