: బీజేపీకి, జానారెడ్డికి మాట్లాడే హక్కు లేదు: తలసాని
ఆంధ్రప్రదేశ్ కు లక్ష ఇళ్లను కేటాయించి, తెలంగాణకు పది వేల ఇళ్లు కేటాయించిన బీజేపీకి రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, వివక్ష పాటించకూడదని సూచించారు. కేంద్రం తెలంగాణకు కేటాయించిన ఇళ్లను చూస్తే వివక్ష ఉందో లేదో తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే దూరం జరిగానని జానారెడ్డి చెబుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అలాంటి పదవి తెలంగాణ నేతలకు ఎవరికైనా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పేదల కోసం ఏనాడైనా ఏదైనా చేశారా? అని ఆయన అడిగారు. బీజేపీకి కానీ, జానారెడ్డికి కానీ మాట్లాడే హక్కు లేదని ఆయన తెలిపారు. తాము అధికారం చేపట్టగానే పేదల కోసం ఆలోచించడం మొదలు పెట్టామని, వారి సంక్షేమం కోసమే పని చేస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో మిగులు విద్యుత్ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని, త్వరలో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంటుందని ఆయన తెలిపారు.