: పారిస్ నగర వాసులను కదిలించిన ముస్లిం!


ఉగ్ర వాదుల దాడులతో విలపిస్తున్న పారిస్ నగరంలో కళ్లకు గంతలు కట్టుకున్న ఒక ముస్లిం వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజలను కదిలించాయి. అతనిపై ఆప్యాయతను కురిపించి, హగ్ చేసుకున్నారు. పారిస్ లో కళ్లకు గంతలు కట్టుకున్న ఆ వ్యక్తి, ‘నేను ముస్లింను, కానీ నన్ను టెర్రరిస్టు అంటున్నారు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మరి, మీరు కూడా నన్ను నమ్ముతున్నారా? అవును... అని ఎవరైతే చెప్పదలచుకున్నారో వారు నన్ను హగ్ చేసుకోండి’ అంటూ అందర్నీ ఆకట్టుకున్నాడు. అక్కడ ఉన్న పారిస్ ప్రజలు ఇందుకు చలించిపోయారు. ఒకరి తర్వాత ఒకరు... అట్లా వందల మంది ఆ ముస్లిం వ్యక్తిని హగ్ చేసుకున్నారు. అనంతరం తన కళ్లకు ఉన్న గంతలను అతను తీసివేశాడు. తన చుట్టూ ఉన్న వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ‘నేను ముస్లింని, ఆకారణంగా నన్ను టెర్రరిస్టుని చేయవద్దు. నేను ఎవ్వరినీ చంపలేదు. పారిస్ లో ‘ఉగ్ర’దాడులు జరిగిన రోజు నా పుట్టినరోజు. ఆ రోజు నేను బయటకే రాలేదు. నేను ఒక్క విషయాన్ని చెప్పదలచుకున్నాను. టెర్రరిస్టు అంటే... అకారణంగా మరొకరి ప్రాణాలు తీసుకునేవాడు. ‘ముస్లిం’ అనే వ్యక్తి ఇటువంటి పనులకు పాల్పడడు. హింసను మా మతం ఒప్పుకోదు’ అని పేరు చెప్పని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. పారిస్ ‘ఉగ్ర’ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News