: మరో విమానానికి బాంబు బెదిరింపు!... సోఫియాలో అత్యవసర ల్యాండింగ్
మరో విమానంలో బాంబు ఉందన్న కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పోలాండ్-ఈజిప్టు విమానంలో బాంబు పెట్టారన్న సమాచారంతో ఏవియేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. బల్గేరియా రాజధాని సోఫియాలో ఆ విమానాన్ని అత్యవసరంగా దింపివేశారు. వార్సా నుంచి హర్గదా నగరానికి ఈ విమానం వెళుతుండగా ఒక ప్రయాణికుడు (64) ఈ సమాచారం అందించాడని, ఈ విషయమై భద్రతాధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారని బల్గేరియా మీడియా పేర్కొంది. బాంబు పెట్టారన్న సమాచారంతో విమానాన్ని బల్గేరియాలో ల్యాండ్ చేశారని, ప్రయాణికులను దించివేసి సోదాలు చేపట్టినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలింది. ఈ ఘాతుకానికి ఐఎస్ ఉగ్రవాదులే కారణమన్న వార్తల నేపథ్యంలో పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపుతో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి ఫ్రాన్స్ వస్తున్న రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.