: ఆన్ లైన్ లో ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే, పార్శిల్ లో వచ్చింది రాళ్లు, చపాతీ ముక్కలు!
ఆన్ లైన్ మోసాలకు అంతు లేకుండా పోతోంది. ఇంటినుంచే షాపింగ్ చేస్తున్న వారిని నకిలీ కంపెనీలు దగా చేస్తున్నాయి. తాజాగా ఓ బీటెక్ విద్యార్థి ల్యాప్ టాప్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా రాళ్లు, చపాతీ ముక్కలు రావడం చూసి కంగుతిన్న ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పోణంగి రోడ్డులో ఉంటున్న కొలుసు తారకరామ్ అనే బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 12న పేటీఎంలో లెనోవా కంపెనీ ల్యాప్ టాప్ ను బుక్ చేశాడు. ఇందుకు రూ.31,940లను అప్పటికప్పుడే ఆన్ లైన్ లో చెల్లించాడు. ఓ ఆరు రోజుల తరువాత అంటే నిన్న (బుధవారం) బ్లూడాట్ కొరియర్ ద్వారా విద్యార్థి ఇంటికి పార్శిల్ వచ్చింది. ఆతృతతో తెరచి చూడగా రెండు రాళ్లు, కొన్ని చపాతీ ముక్కలు దర్శనమిచ్చాయి. ల్యాప్ టాప్ స్థానంలో ఊహించని వస్తువులుండటంతో అతను నిర్ఘాంతపోయాడు. వెంటనే ఆ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసినా స్పందన లేదు. దాంతో అతడు విషయాన్నంతటినీ మీడియాకు వెల్లడించాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.