: సీఎం కేసీఆర్ పై సీబీఐ విచారణ వాస్తవమే: మాజీ ప్రైవేట్ కార్యదర్శి దిలీప్ కుమార్
స్వీయ పీఎఫ్ ఖాతాలు నిర్వహించుకునేందుకు సహారా గ్రూపుకు యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన అనుమతులపై సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తాజాగా కేసీఆర్ మాజీ ప్రైవేట్ కార్యదర్శి దిలీప్ కుమార్ పలు విషయాలు తెలిపారు. ఈ విషయంలో కేసీఆర్ ను సీబీఐ విచారించిన మాట వాస్తవమేనని చెప్పారు. ఇక కేంద్ర మంత్రిగా కేసీఆర్ సిఫారసు చేస్తేనే కార్యదర్శిగా తాను సంతకం చేశానన్నారు. అయితే కేంద్ర కార్మిక శాఖలో జరిగిన అవకతవకలే సీబీఐ విచారణకు కారణం కావొచ్చని దిలీప్ వరంగల్ లో పేర్కొన్నారు. సీబీఐ విచారణ వివరాలను మాత్రం తాను వెల్లడించలేనని అన్నారు. ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాల్సింది కేసీఆరేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనతో సహా అప్పుడు కార్మిక శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులను కూడా సీబీఐ విచారించిందని తెలిపారు. తనను రెండు నెలల క్రితమే విచారించారని, అయితే కేసీఆర్ ను విచారించాకే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు.