: ఆ 150 మందిని డేగకన్నుతో కాపలా కాస్తున్న భారత్!


ఇండియాలోని దాదాపు 150 మంది... అందులో ఎక్కువ మంది దక్షిణాది వారు. వారిలో కూడా తెలంగాణ, కేరళకు చెందిన వారు అత్యధికులు. దాదాపు అంతా యువకులే. వారిపై భారత నిఘా వర్గాలు డేగకన్ను వేశాయి. నిత్యమూ వారేం చేస్తున్నారు? సామాజిక మాధ్యమాల్లో వారు పెడుతున్న పోస్టింగ్స్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఇత్యాది విషయాలన్నీ గమనిస్తున్నారు. ఎందుకో తెలుసా? వీరంతా ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో చేరాలని భావిస్తున్న వారు కావడమే. వీరందరూ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై సానుభూతి చూపుతూ, వారితో టచ్ లో ఉన్నారట. ఆన్ లైన్ మాధ్యమంగా సంప్రదింపులు సాగిస్తున్న వీరిపై నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ 23 మంది భారతీయులు సిరియా వెళ్లి ఉగ్రవాదులుగా మారగా, అందులో ఆరుగురు వివిధ ఘటనల్లో మరణించినట్టు అధికారిక సమాచారం. వీరిలో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సుల్తాన్ అజ్మీర్ షా, బడా సాజిద్ లు కూడా ఉన్నారు. మరో యువకుడు ఐఎస్ఐఎస్ విధానాలు నచ్చక వెనక్కు వచ్చేశాడు. మరో 30 మంది భారతీయులు ఐఎస్ఐఎస్ కు ప్రభావితులై బయలుదేరగా, వారిని విమానాశ్రయాల్లో నిలువరించారు. ఈ 150 మందీ దేశం విడవకుండా చూస్తున్నామని, అవసరమైతే ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామని నిఘా వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News