: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం... స్వయంగా విచారణ చేస్తున్న కలెక్టర్
రాయలసీమలో ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలగా పేరుగాంచిన కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగిందన్న వార్తలు గుప్పుమన్నాయి. కర్నూలు నగరంలోని కళాశాలకు అనుబంధంగా విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉంది. ఈ క్రమంలో మెన్స్ హాస్టల్ లో ఇటీవల సీనియర్లు జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. పరిచయం పేరిట జరుగుతున్న ఈ తంతులో కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ కు తెర తీశారు. దీనిపై మనస్తాపానికి గురైన కొందరు మొన్న రాత్రి నేరుగా పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ వేగంగా స్పందించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన ఆయన నేరుగా మెన్స్ మెడికల్ హాస్టల్ కు వెళ్లారు. సీనియర్లు, జూనియర్ విద్యార్థులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ర్యాగింగ్ కు సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఆయన జూనియర్లకు భరోసా ఇచ్చారు. ఇకపై ర్యాగింగ్ కోణంలో ఎలాంటి ఘటన జరిగినా తనకు నేరుగా సమాచారం ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన జూనియర్లకు హామీ ఇచ్చారు. నేరుగా కలెక్టరే స్వయంగా రంగంలోకి దిగడంతో సీనియర్లు తోక ముడిచినట్లు తెలుస్తోంది.