: ఖానాపూర్ అడవుల్లో కాల్పుల మోత... ఇద్దరు మావోలు చనిపోయినట్లు ప్రచారం!
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు ఖానాపూర్ అటవీ ప్రాంతం నిన్న సాయంత్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య గంటల తరబడి జరిగిన కాల్పుల్లో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఈ కాల్పుల్లో పైచేయి సాధించిన పోలీసులు ఇద్దరు మావోయిస్టులను నేలకూల్చినట్లు తెలుస్తోంది. అయితే మావోలు చనిపోయిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఎన్ కౌంటర్ జరిగిన మాట వాస్తవమేనని చెబుతున్న ఆదిలాబాదు ఓఎస్డీ, మావోలు చనిపోయిన విషయంపై నోరు విప్పడం లేదు. అంతేకాక తమ కాల్పుల్లో గాయాలపాలైన ఇద్దరు మావోయిస్టులతో పాటు మరికొంత మంది మావోలు తప్పించుకుని పారిపోయారని నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన చెప్పారు. మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతంలో కనిపిస్తున్న రక్తపు మరకలతో పోలీసుల వాదన సరికాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పది రోజుల క్రితం మావోల చేతిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా పోలీసులతో కలిసి రంగంలోకి దిగిన ఆదిలాబాదు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఉప ఎన్నికకు ముందు ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడంతో పోలీసులు నోరు మెదిపేందుకు ఇబ్బంది పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బక్కన్న అనే మావోయిస్టు చనిపోయినట్లు వినిపిస్తున్న వార్తలపై ఆదిలాబాదు ఎస్పీ తరుణ్ జోషి స్పందిస్తూ ‘జరిగి ఉండవచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేయడం గమనార్హం.