: యాంటీ ముస్లిం సెంటిమెంట్ ఎక్కువైంది: అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ ప్రతినిధి
పారిస్ లో ఉగ్రవాదుల దాడుల అనంతరం యాంటి- ముస్లిం సెంటిమెంట్ ఎక్కువైందని, మసీదులపై దాడులు జరుగుతున్నాయని అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఇబ్రహీం హూపర్ అన్నారు. పారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన తర్వాత అమెరికాతో పాటు ఇతర దేశాలలో ఉన్న ముస్లింలపై ప్రతీకార దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇస్లామిక్ సెంటర్లపై దాడులు, మసీదుల కూల్చివేత, ముస్లిం వ్యక్తులను బెదరిస్తూ ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా మెస్సేజ్ లు వస్తున్నాయని ఇబ్రహీం పేర్కొన్నారు. పారిస్ ‘ఉగ్ర’ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత ఇంగ్లాండు కనెక్టికట్ లో ఉన్న బైతుల్ అమాన్ మసీదుపై తుపాకీ కాల్పులు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సంఘటనపై ఎఫ్ బీఐ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ మసీదుపై కాల్పులకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందన్న విషయం తమకు అర్థం కావట్లేదని న్యూయార్క్ లోని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ అధికార ప్రతినిధి సలాం భాటి అన్నారు. మసీదుల కూల్చివేత, బెదరింపుల విషయమై నెబ్రాస్కా, ఫ్లోరిడా, టెక్సాస్, కెంటకీ, వర్జీనియా, టెన్నెసీ, ఒహియో, న్యూయార్క్ మొదలైన రాష్ట్రాలలోని ముస్లిం నాయకులు, మత పెద్దలు తమకు సమాచారం అందించారని సలాం భాటి పేర్కొన్నారు.