: 26/11 కేసులో డేవిడ్ హెడ్లీకి ముంబై కోర్టు సమన్లు
26/11 దాడి కేసులో పాకిస్థాన్-అమెరికన్ లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని ప్రధాన నిందితుడిగా చేర్చేందుకు ముంబై ప్రత్యేక టాడా కోర్టు అనుమతి తెలిపింది. ఈ మేరకు అతనికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతనిని విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతి తెలిపింది. ప్రస్తుతం హెడ్లీ అమెరికా జైల్లో ఉన్నాడు. ఈ కేసులో నిందితుడిగా చేర్చాలని ముంబై పోలీసులు అక్టోబర్ 8న పిటిషన్ దాఖలు చేశారు. అయితే హెడ్లీ అమెరికా జైల్లో ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాబోవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. ఈ క్రమంలో టాడా కోర్టు విచారణకు అంగీకరించింది.