: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా... రేపు ఆగనున్న రైల్వే, ఐటీ, ఎక్సైజ్, పోస్టల్ సేవలు!
ఏడవ వేతన సంఘం సిఫార్సులు తమకు ఆమోదయోగ్యం కాదని, అంతకన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రేపు దేశవ్యాప్త మహాధర్నాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎఫ్డీఐలనూ తాము వ్యతిరేకిస్తున్నామని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఎన్ఎఫ్ఐఆర్ (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్) ప్రధాన కార్యదర్శి ఎం రాఘవయ్య వెల్లడించారు. సమ్మెలో రైల్వే శాఖతో పాటు రక్షణ, ఆదాయపు పన్ను, ఎక్సైజ్, పోస్టల్ ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఏడవ వేతన సంఘం మెరుగైన ఫిట్ మెంటును ప్రకటించాలని, కనీస వేతనంగా రూ. 26 వేలు, జీతంలో 67 శాతం పెన్షన్ తప్పనిసరని ఆయన డిమాండ్ చేశారు. రేపటి సమ్మె తరువాత డిమాండ్లను పరిష్కరించకుంటే, వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసులను ఇచ్చామని రాఘవయ్య తెలిపారు.