: ఫ్రాన్స్ పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల హతం...ప్రాణాలతో పట్టుబడ్డ మరో ముగ్గురు ఉగ్రవాదులు!
నేటి ఉదయం జరిపిన ఫ్రాన్స్ పోలీసుల ఆపరేషన్ విజయవంతమైంది. దాక్కుని కాల్పులు జరుపుతున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో మరో ముగ్గురు మరణించారని అధికారులు వెల్లడించారు. మరణించిన ముగ్గురు కూడా అనుమానిత ఉగ్రవాదులే అయి ఉంటారని సమాచారం. ఫ్రాన్స్ లో ఉగ్రదాడిలో పాలు పంచుకున్న 9వ ఉగ్రవాది కోసం సాగిస్తున్న వేటలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ లో మరికొందరు ముష్కరులు ఉండవచ్చన్న అనుమానాలతో పోలీసులు, సైన్యం జల్లెడ పడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పట్టుబడిన వారిని విచారిస్తే, ఫ్రాన్స్ లో మకాం వేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల గురించిన మరింత సమాచారం వెలువడవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.