: రెండో టెస్టు డ్రా... నాలుగో రోజూ వర్షంతో అంపైర్ల నిర్ణయం
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో డెస్టు డ్రాగా ముగిసింది. తొలి రోజు ఆట తర్వాత వరుసగా నాలుగు రోజులుగా వర్షం అడ్డంకిగా నిలిచింది. ఐదో రోజైన నేడు వర్షం కారణంగా ఆట జరగని నేపథ్యంలో మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ప్రకటించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచి సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించిన టీమిండియా స్పిన్ తో మాయాజాలం చేసింది. కేవలం 59 ఓవర్లలోనే సఫారీలను 214 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండానే 22 ఓవర్లలో 80 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే వరుణుడు మ్యాచ్ కు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో టీమిండియా సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో మూడో టెస్టు నాగ్ పూర్ వేదికగా ఈ నెల 25న ప్రారంభం కానుంది.