: ఆసుపత్రి నుంచి కార్యాలయానికి అనురాధ మృతదేహం తరలింపు ... వేలాదిగా అభిమానులు, టీడీపీ కార్యకర్తల హాజరు
దుండగుల దాడిలో నిన్న తన కార్యాలయంలోనే కన్నుమూసిన చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ భౌతిక కాయానికి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి ఉదయం పోస్టుమార్టం పూర్తైంది. ఆ తర్వాత కఠారి బంధువులు అనురాధ మృతదేహాన్ని కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణానికి తరలించారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన కఠారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అనురాధకు అశ్రు నివాళి అర్పించారు. ర్యాలీ సందర్భంగా కఠారి నినాదాలతో చిత్తూరు నగరం మారుమోగిపోయింది. మరోవైపు కఠారి దంపతుల హత్యకు నిరసనగా కాపునాడు ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరులో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు.