: చిక్కుల్లో ‘పతంజలి’ నూడుల్స్... ప్రొడక్ట్ అప్రూవల్ లేదంటున్న ‘ఫుడ్ సేఫ్టీ’
నెస్లే ఉత్పత్తి ‘మ్యాగీ’ నూడుల్స్ సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవలే మార్కెట్లోకి పున:ప్రవేశం చేసింది. మ్యాగీలో హానికర రసాయనాలున్నాయన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ ఓ వైపు పరీక్షలు నిర్వహిస్తుండగానే, పలు రాష్ట్రాలు మ్యాగీపై నిషేధం విధించాయి. అయితే సుదీర్ఘ కాలం పాటు సాగిన పరీక్షల్లో మ్యాగీ మళ్లీ పాసైంది. మ్యాగీపై వివాదం నేపథ్యంలో ‘పతంజలి’ నూడుల్స్ పేరిట కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నిర్ణయించారు. ఇటీవలే ‘పతంజలి’ పేరిట నూడుల్స్ మార్కెట్ రంగ ప్రవేశం చేశాయి. మ్యాగీ కన్నా తక్కువ ధరకే ‘పతంజలి’ దొరుకుతుందంటూ రాందేవ్ చేసిన ప్రచారం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా పతంజలి నూడుల్స్ కు ‘ప్రొడక్ట్ అప్రూవల్’ లేదంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ పెద్ద బాంబే పేల్చారు. తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నెంబరును నూడుల్స్ ప్యాకెట్లపై పతంజలి సంస్థ ముద్రించిందని, దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను ఊటంకిస్తూ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ సంచలన కథనం రాసింది. ఈ కథనం రాందేవ్ బాబాకు పెద్ద చిక్కులనే తెచ్చేలా ఉంది.