: దాగున్న 9వ ముష్కరుడు... ఉగ్రవేటలో ఫ్రాన్స్ పోలీసులకు గాయాలు
ఫ్రాన్స్ పై జరిపిన ఉగ్రవాదుల దాడిలో 8 మంది పాల్గొన్నారని భావిస్తూ వచ్చిన భద్రతా దళాలకు 9వ ముష్కరుడు కూడా ఉన్నాడని స్పష్టమైంది. దీంతో, ఈ ఉదయం తుపాకులు గర్జించాల్సి వచ్చింది. ఫ్రాన్స్ శివారు ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వెతుకులాడుతున్న వేళ పోలీసులకు ఓ ఉగ్రవాది తారసపడ్డాడు. అతను తన చేతిలోని తుపాకితో కాల్పులు జరపడంతో కొందరు పోలీసులు గాయపడ్డారని ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తున్న బీఎఫ్ఎం టీవీ చానల్ ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్ లో ఉగ్రవాది మరణించాడా? లేదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని సమీప ప్రాంతాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. కాగా, ఉగ్రవాదులు 9 మందేనా? లేక ఇంకా ఎంతమందైనా ఉన్నారా? అన్న విషయమై సరైన సమాచారం లేక పోలీసు వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.