: భయపడుతున్న బిడ్డకు ధైర్యం చెప్పి, ఆ చిన్నారి చేత "ఐ ఫీల్ బెటర్ నౌ" అనిపించారు!
గత శుక్రవారం నాడు 89 మంది అమాయకులను ఉగ్రవాదులు బలిగొన్న బటాక్లాన్ థియేటర్ వద్ద ఫ్రాన్స్ కు చెందిన ఓ వీడియో చానల్ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. తండ్రి ఒడిలో ఒదిగిన ఓ చిన్నారి, వచ్చీ రాని మాటలతో మాట్లాడుతుంటే, ఆ వీడియోను ఇంగ్లీషులోకి అనువదించి ఫేస్ బుక్ లో ఉంచారు. ఈ సంభాషణకు "అత్యంత విలువైనది" అంటూ క్యాప్షన్ కూడా తరలించారు. బటాక్లాన్ సమీపంలో మృతులకు నివాళులు అర్పిస్తున్న వేళ ఓ విలేకరి ఆ చిన్నారిని పలకరించాడు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? అని ఆ చిన్నారి బ్రాండన్ ను ప్రశ్నించగా, "ఎందుకంటే వాళ్లు నిజంగా గొప్పవాళ్లు. చెడ్డోళ్లు అంత మంచోళ్లు కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇళ్లు మారాలి" అన్నాడు. ఆ వెంటనే తండ్రి ఏంజల్ లీ కల్పించుకుంటూ "ఓహో... డోంట్ వర్రీ... మనం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఫ్రాన్స్ మన ఇల్లు" అని సముదాయించగా, ఆ బాబు చూసిన అనుమానపు చూపులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. "ఇక్కడ చెడ్డవారు ఉన్నారు పాపా. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. మనల్ని కాలుస్తారు" అని భయపడుతూ చెప్పాడు. "వారి చేతుల్లో తుపాకులు ఉంటే, మన చేతిలో పూలున్నాయి" అంటూ శాంతిని గురించి చెప్పబోగా, "పూలు ఏమీ చేయలేవుగా?" అంటూ బ్రాండన్ మరోసారి అమాయకంగా ప్రశ్నించాడు. "తుపాకులపై పోరాడేందుకే పూలున్నాయి. చూడు అందరూ వాటిని ఎలా ఉంచుతున్నారో" అనగా, "అవన్నీ మన రక్షణకేనా?" అని మరో ప్రశ్న సంధించాడు. "అవును" అని లీ సమాధానం చెప్పగా, మరా కొవ్వొత్తులు ఎందుకని అడిగాడు. వాటిని మరణించిన ప్రజలకు గుర్తుగా వెలిగిస్తున్నారని తండ్రి చెప్పడంతో, "కొవ్వొత్తులు, పూలు మన రక్షణ కోసమేనా?" అని మరో ప్రశ్నవేసి ఆపై "ఐ ఫీల్ బెటర్ నౌ" అనేశాడు. నిన్న ఈ వీడియోను అప్ లోడ్ చేయగా, ఇప్పటికే 12 లక్షల మందికి పైగా చూశారు.