: ఇక బాంబు బెదిరింపులు... దారి మళ్లిన రెండు ఫ్రాన్స్ విమానాలు
ఉగ్రవాద దాడులతో అట్టుడికిపోయిన ఫ్రాన్స్ ను ఆ భయం వీడటం లేదు. అంతేకాక ఉగ్రవాదులు కూడా ఆ దేశాన్ని అంత త్వరగా విడిచి పెట్టేలా లేరు. నిన్న ఉదయం బాంబు బెదిరింపుల కారణంగా ఆ దేశానికి చెందిన రెండు విమానాల దారి మళ్లింది. అమెరికా నుంచి ఫ్రాన్స్ బయలుదేరిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఏవియేషన్ అధికారులు, పైలట్లు సదరు విమానాలను సురక్షితంగానే ల్యాండ్ చేశారు. నిన్న ఉదయం అమెరికా నగరం లాస్ ఏంజెలిస్ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్ విమానాన్ని పేల్చివేయనున్నట్లు బెదిరింపులు వచ్చాయి. అయితే వెనువెంటనే స్పందించిన అధికారులు విమానాన్ని సాల్ట్ లేక్ సిటీ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు. న్యూయార్క్ నుంచి ప్యారిస్ కు బయలుదేరిన మరో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విమానాన్ని దారి మళ్లించిన పైలట్లు నోవా స్కోటియాలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.