: పాట్నాకు తరలుతున్న మహామహులు, రాష్ట్రాధినేతలు!
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ చేయనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారథులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలకతీతంగా బడా నేతలు కదులుతున్నారు. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీని రాష్ట్రంలో ఓడించిన ఘనత సాధించిన నితీశ్ ను అభినందించేందుకు పలు రాష్ట్రాల నేతలు పాట్నాకు బయలుదేరుతున్నారు. శుక్రవారం నాడు జరిగే ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా, పాట్నాకు వెళుతున్న వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పాలిత అసోం, కర్ణాటక, ఉత్తరాఖండ్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరితో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుక్ బీర్ సింగ్ బాదల్ శుక్రవారం పాట్నా చేరుకోనున్నారు. నితీశ్ మహా నాయకుడని పొడగ్తల వర్షం కురిపించిన శివసేన, మహారాష్ట్ర నుంచి ఇద్దరు మంత్రులను ఈ కార్యక్రమానికి పంపాలని నిర్ణయించింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా పాట్నా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఈ ఉత్సవానికి వస్తారా? రారా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం, జేడీ(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రులు శిబూ సోరెన్, బాబూలాల్ మరాండీలు తాము పాట్నా వెళ్లనున్నట్టు ప్రకటించారు.