: ఒకే కుటుంబంలో నలుగురికి పదవులు కట్టబెట్టాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా?: కేసీఆర్ ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి శవాల తెలంగాణగా మార్చారని అన్నారు. తమది నక్సలైట్ల ఎజెండా అని కేసీఆర్ అంటున్నారని, అయితే, దాన్ని నక్సలైట్లే వ్యతిరేకించారని అన్నారు. ఒకే కుటుంబంలో నలుగురికి పదవులు కట్టబెట్టాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన పీజీ విద్యార్థిని శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలను హింసించి చంపారని ఆరోపించారు. పత్తికి మద్దతు ధర కల్పించాలని ప్రశ్నించిన కొమురయ్య అనే రైతును జైలులో పెట్టారని, మరి ఆ రైతును బహిరంగంగా అవమానపరిచిన కడియం శ్రీహరిపై ఎందుకు కేసు పెట్టలేదని అన్నారు. కడియంకు చేసిన ‘సన్మానమే’ కేసీఆర్‌కూ జరగాలన్నారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటే 1956కు ముందు ఇక్కడ జన్మించినవారు అయి ఉండాలన్న కేసీఆర్... ఆంధ్రా కాంట్రాక్టర్లకు కూడా అదే నిబంధన ఎందుకు పెట్టలేదని, అప్పుడే టెండర్లు ఇస్తామన్న నిబంధన ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.. రైతు సమస్యలపై కోదండరాం వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించినందున ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.