: మోదీ వచ్చాక రెట్టింపైన బ్యాంకు మోసాలు!
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తరువాత బ్యాంకులను మోసం చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలో బ్యాంకు మోసాల సంఖ్య రెట్టింపైందని, ఆర్బీఐ ఫ్రాడ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసే దిశగా ఒత్తిడి పెరిగిందని, ఈ విషయంలో ప్రధాని కార్యాలయం సైతం పరిస్థితిని సమీక్షిస్తోందని సమాచారం. మోసాలు జరగక ముందే వాటిని కనిపెట్టే వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రధాని కార్యాలయం బ్యాంకర్లతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించగా, జరుగుతున్న మోసాల పట్ల ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. బౌన్స్ అవుతున్న చెక్కుల సంఖ్య పెరగడం, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) శాతం, రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న వారి సంఖ్య వృద్ధి తదితరాలు బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని సమీక్షకు హాజరైన అధికారులు అభిప్రాయపడ్డారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'ఆన్ లైన్ ఆర్టీఐ డాట్ కాం' గణాంకాల ప్రకారం, కేవలం నిరర్థక ఆస్తులు మాత్రమే మోసాలకు కారణమని భావించలేమని స్పష్టమవుతోంది. 2013-14తో పోలిస్తే 2014-15లో ఎన్పీఏ 23 శాతం పెరిగింది. ఇక ఆర్బీఐ గణాంకాల ప్రకారం, మోదీ సర్కారు ఏర్పడిన తరువాత బ్యాంకు ఫ్రాడ్ ల సంఖ్య 100 శాతం పెరిగింది. 2012-13లో 1,83,854 కోట్ల విలువైన మోసాలు జరుగగా, 2013-14లో 2,51,060 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం 3,09,409 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2012-13లో 880 కోట్ల విలువైన మోసాలు జరుగగా, 2013-14లో రూ. 1,258 కోట్లు, 2014-15లో రూ. 924 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ లో గత సంవత్సరం రూ. 5,930 కోట్ల విలువైన మోసాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో అత్యధికం ఫేక్ లోన్స్, క్రెడిట్ కార్డు మోసాలు, సైబర్ నేరాలు ఉన్నాయని తెలుస్తోంది. లక్ష రూపాయల కన్నా విలువైన మొత్తాల మోసాల్లో సాల్వ్ చేసిన కేసుల సంఖ్య 15 శాతాన్ని మించలేదు. బ్యాంకుల పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ. 2,310 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,150 కోట్లతో రెండో స్థానంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,601 కోట్లతో మూడవ స్థానంలో నిలిచాయి. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో 30 శాతం ప్రాతినిధ్యమున్న ప్రైవేటు రంగ బ్యాంకులు మోసాల విషయంలో మాత్రం 40 శాతం వాటాను కలిగివున్నట్టు గణాంకాలు చూపుతున్నాయి. పలు కేసుల్లో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు నిరూపితం కావడం ఆర్బీఐని కలవరపెడుతోంది. సాధ్యమైనంత త్వరలో ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు అత్యవసరమని భావిస్తున్నట్టు గత పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.