: మరిన్ని దాడులకు ఐఎస్ కుట్ర... వాటిని అడ్డుకోవడమూ అసాధ్యమేనంటున్న అమెరికా
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ముప్పేట దాడితో ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఐఎస్ ఉగ్రవాదులు మరింత మేర బరితెగించేందుకు పక్కాగా వ్యూహాలు పన్నుతున్నారట. పకడ్బందీగా జరుగుతున్న ఈ తరహా దాడులకు కళ్లెం వేయడం అంత సులువేమీ కాదని సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐఎస్ ఉగ్రవాదులు రచించుకున్న ప్రణాళికల్లో భాగంగా తొలి దాడి ప్యారిస్ పై చోటుచేసుకుందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెస్నన్ చెప్పారు. ప్యారిస్ పై ఉగ్రవాదుల దాడి, ఆ తర్వాత ఉగ్రవాదుల నుంచి వెలువడిన ప్రకటనలకు సంబంధించి జరిగిన కీలక సమావేశంలో బ్రెస్నన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాపై కూడా దాడులకు దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో ఒక్క ఇరాక్, సిరియాల్లోనే కాక ఐఎస్ ఉగ్రవాదులకు ఇతర ప్రాంతాల్లోనూ స్ధావరాలు ఉన్నట్లుగా తెలుస్తోందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.