: జగన్ పై రేవంత్ ఫైర్!... తెలంగాణ వద్దన్న వ్యక్తికి ఓటడిగే హక్కు లేదని ధ్వజం
వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు ఓరుగల్లు ప్రజల ఓట్లను చేజిక్కించుకునేందుకు భారీ యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. నేతల చక్కర్లతో వీధులన్నీ దుమ్ముతో నిండిపోయాయి. ఆది నుంచి విస్తృత ప్రచారం సాగిస్తున్న టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన కుటుంబంపైనా నిప్పులు చెరిగారు. తాజాగా వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విజయం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్ కు వరంగల్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కే లేదని ఆయన తేల్చిచెప్పారు. విపక్షాల ఓట్లను చీల్చేందుకే కేసీఆర్, జగన్ ను రంగంలోకి దించారని కూడా ఆయన ఆరోపించారు.