: యుద్ధానికి దిగాం... అధికారికంగా వెల్లడించిన ఫ్రాన్స్
ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసే దిశగా యుద్ధానికి దిగినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ప్రకటించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఉగ్రవాదులను తుదముట్టించే సైన్యానికి మరింత ఆయుధ సంపత్తి, నిధుల కోసం రాజ్యాంగ సవరణ చేయనున్నట్టు ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ఫ్రాన్స్ పై దాడుల వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో కనుగొన్నామని, త్వరలో అతన్ని చట్టం ముందు నిలుపుతామని అన్నారు. పోలీసు వ్యవస్థ మరింత సులువుగా దాడులు జరిపేందుకు, అనుమానం వచ్చిన వారందరినీ గృహ నిర్బంధం చేసేందుకు అధికారాలు ఇచ్చేలా పార్లమెంటులో కొత్త చట్టాన్ని తేవాల్సి వుందని, అందుకు సభ్యులంతా సహకరించాలని అన్నారు. దేశంలో మూడు నెలల పాటు ఎమర్జన్సీ విధించి, ఫ్రాన్స్ పౌరుల్లో ఎవరు రెండు పాస్ పోర్టులను కలిగివున్నారో, ఎవరు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారో తెలుసుకోవాల్సి వుందని వివరించారు. ఉగ్రవాదులు ఎన్ని దాడులు చేసినా ఫ్రాన్స్ ను ఏమీ చేయలేరని, ఉగ్ర ఘటనలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుంటామని హొలాండే అన్నారు. సిరియాపైన, అక్కడ ఉగ్రవాదులు దాగున్న స్థావరాలపైన ఇతర దేశాలతో కలిసి దాడులకు దిగుతామని తెలియజేశారు.